‘పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు’.. కుండబద్ధలు కొట్టిన అమెరికా!

  • ఇరాన్‌తో ఒప్పందం విషయంలో గందరగోళం
  • అమెరికా తరహాలో పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదన్న వాన్స్
  • అందుకే ఒప్పంద వివరాలు త్వరగా వెల్లడి కాలేదని వ్యాఖ్య
  • ఒప్పందం కుదర్చడం తమ ఘనతగా చెప్పుకొంటున్న పాక్‌
  • వాన్స్ వ్యాఖ్యలతో పాక్‌కు ఇబ్బందికర పరిస్థితి
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో పాకిస్థాన్‌కు మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు ఇస్లామాబాద్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. ఒప్పంద వివరాల విడుదల ఆలస్యంపై స్పందించిన ఆయన పాకిస్థాన్‌లో అమెరికా తరహా పత్రికా స్వేచ్ఛ లేదని వ్యాఖ్యానించారు.

ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన వాన్స్ అమెరికాలో ఒప్పందాల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలనే అంచనాలు ఉంటాయని చెప్పారు. కానీ పాకిస్థాన్, ఖతార్ వ్యవస్థల్లో అలాంటి సంప్రదాయం లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఇరాన్‌తో ఒప్పంద వివరాలు విడుదల చేసే విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందని తెలిపారు.

ఇప్పటికే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో పాకిస్థాన్ 180 దేశాల్లో 153వ స్థానంలో ఉంది. అక్కడ జర్నలిస్టుల స్వేచ్ఛపై అంతర్జాతీయ సంస్థలు గతంలోనూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని తమ దౌత్య విజయంగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన సంతకాల కార్యక్రమం రద్దు కావడం కూడా పాకిస్థాన్‌కు ఇబ్బందిగా మారింది. చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ డిజిటల్ పద్ధతిలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

JD Vance
Pakistan Media Freedom
US Iran Peace Deal
Donald Trump
World Press Freedom Index
Masoud Pezeshkian

More Telugu News